రాయలసీమ లిఫ్ట్ స్కీం అక్రమం..కఠిన చర్యలు తీసుకోండి 

  • ఎన్జీటీలో పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు

చెన్నై: రాయలసీమ లిఫ్ట్ స్కీం అక్రమం.. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కి ఉంది.. కేసును తప్పుదోవ పట్టించేలా సిఎస్ అఫిడవిట్లు వేశారు.. తీర్పు ఉల్లంఘనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకునే అధికారం ఎన్జీటీకి ఉంది.. ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 26, 28ల కింద కఠిన చర్యలు తీసుకోవాలి..’ అంటూ పిటిషనర్ తరపు న్యాయవాది ఎన్జీటీకి విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కోర్టు ధిక్కరణ కేసులో పిటిషనర్ తరపున న్యాయవాది శ్రవణ్ కుమార్ ఇవాళ వాదనలు వినిపించారు. 
ఈనెల 30వ తేదీన ఏపీ చీఫ్ సెక్రెటరీ ఆదిథ్యనాథ్ దాస్ రిటైర్ అవుతున్నందున ఈలోగా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్ జి టి అధికారాలపై పలు సుప్రీంకోర్టు తీర్పులను పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ ఉటంకించారు. తీర్పు ఉల్లంఘనలు జరిగినప్పుడు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ జి టి తీర్పు ఉల్లంఘనలు చేస్తే నేరుగా జైలుకు పంపిన సందర్భాలు రానప్పటికీ ఇప్పుడు స్పష్టంగా ఉల్లంఘనలు కనిపిస్తున్నందు వల్ల చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టి ఎన్ శేషన్ వచ్చే వరకు ఎన్నికల కమిషన్ కు ఉన్న విస్తృత అధికారులు ఎవరికీ తెలియదని, ఆయన వచ్చాకే ప్రక్షాళన ప్రారంభం అయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. అదే విధంగా ఎన్ జి టి కి ఉన్న అధికారాన్ని అమలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోర్టును కోరారు. పిటిషనర్ వాదనలు ముగిసినందున ఈ నెల 27 న తెలంగాణ ప్రభుత్వం తన వాదనలు వినిపించనుంది. అనంతరం కోర్టు ధిక్కరణ కేసులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీర్పు ఇస్తుంది.